అమెరికా గగనతలంపై గతేడాది జనవరిలో చైనా నిఘా బెలూన్ కనిపించడంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ మొదలైంది. అయితే చైనా నిఘా బెలూన్ అమెరికాకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తాజాగా వెల్లడైంది. పలు అమెరికా సైనిక ప్రాంతాల కీలక సమాచారాన్ని అది చైనాకు చేరవేసినట్లు సోమవారం ఓ మీడియా కథనం పేర్కొంది.
మూడు బస్సులంత ఉన్న ఆ బెలూన్‌ను చైనా అమెరికాలోని పలు ప్రాంతాల మీదుగా తిప్పిందని, ఎలక్ట్రానిక్ సిగ్నళ్లద్వారా సమాచారాన్ని పంపిందని పేరు ఓ మీడియా సంస్థ పేర్కొంది. బెలూన్ ద్వారా చిత్రాలను తీయకుండా ఆయుధాలు, కమ్యూనికేషన్ల వ్యవస్థ గురించి సమాచారం చేరవేసిందని తెలిపింది. దానిని బైడెన్ ప్రభుత్వం నియంత్రించి కూల్చివేయకపోతే మరింత సమాచారాన్ని సేకరించేదని అధికారులు వెల్లడించినట్లు తమ కథనంలో వివరించింది.
మొదటిసారిగా జనవరి 28న చైనా బెలూన్ అలస్కా నుంచి అమెరికాలోని ప్రవేశించిందని, తరువాతి 4 రోజుల్లో మోంటానాలోని ఎయిర్‌బేస్ మీదుగా తిరిగిందని, అక్కడే అమెరికాకు చెందిన కొన్ని అణు వ్యవస్థలున్నాయని అధికారులు వెల్లడించినట్లు మీడియా కథనం పేర్కొంది. ఫిబ్రవరి 4న అమెరికా ఆ బెలూన్‌ను కూల్చేసింది.