గ్యాంగ్ స్టార్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ని ప్రయాగ్ రాజ్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే నిందితులు మాత్రం ఫేమస్ అవ్వడానికే వారిని చంపామని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ఘటనపై మరోసారి స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపడం పై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయని ఆరోపించారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్కౌంటర్ ప్రదేశ్ అయిందని వాపోయారు. యూపీ వాసులు దీనిపై నిరసన వ్యక్తం చేసి.. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. మాది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకునే బిజెపి.. తాము అధికారంలో లేని రాష్ట్రాల విషయంలో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు స్థానం లేదన్నారు మమతా బెనర్జీ.