లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించారు. మహిళా రెజ్లర్లు తనపై చేసిన ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని ప్రస్తావించకుండా.. తన నిస్సహాయతను ఎప్పటికీ అంగీకరించలేనని స్పష్టం చేశారు.
‘‘మిత్రులారా.. నేనెప్పుడూ జీవితంలో ఏం సాధించాను? ఏం కోల్పోయాను? అనే దాని విషయాలగురించి ఆలోచించను. నాలో పోరాడేందుకు శక్తి లేదని భావించిన రోజు నేను నిస్సహాయుడినని భావిస్తా. అలాంటి జీవితాన్ని నేను ఎప్పటికీ ఇష్టపడను. దానికంటే నేను చనిపోవడం మేలని భావిస్తా’’ అని బ్రిజ్ భూషణ్ వీడియోలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మహిళా రెజ్లర్లు మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.