బొబ్బిలి రాజా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దివ్యభారతి.. తన అందమైన రూపంతో ఒకప్పుడు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె హీరోలతో సమానంగా పారితోషకం కూడా అందుకుంది. అందంతో అద్భుతమైన అభినయంతో కోట్లాదిమంది ప్రజల మనసు దోచుకున్న ఈమె నీల పెన్నై అనే సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాతే తెలుగులో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది వెంకటేష్ తో నటించిన బొబ్బిలి రాజా సినిమా హిట్ అవడంతో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు వంటి సినిమాలలో అవకాశం లభించింది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చాయి.
1990లో అడుగుపెట్టిన ఈమె తెలుగు, హిందీ, తమిళ్ లో కలిపి 21 సినిమాలు చేసింది. ఇక హిందీలో షోలా ఔర్ షబ్ నం షూటింగ్ సమయంలో గోవింద ద్వారా ఆమెకు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి 1992 మే 10న రహస్యంగా వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన ఏడాదికే ఆమె ముంబైలోని తన బిల్డింగ్ పైనుంచి జారి కింద పడిపోయి మరణించిన విషయం తెలిసిందే.
అయితే దివ్యభారతి మరణం తర్వాత ఆమె భర్త ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. తర్వాత అప్పటినుంచి దివ్యభారతి తండ్రితో పాటు కలిసి ఉన్న ఆయన 2000 సంవత్సరంలో వార్దాఖాన్ ను వివాహం చేసుకున్నాడు. ఇక ఆయన నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఏది ఏమైనా దివ్యభారతి మరణం ఎవరిని ఎప్పటికీ జీర్ణించుకోలేకపోయేలా చేస్తోందని చెప్పవచ్చు.