కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు చాలా ధైర్యవంతులని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి . పోలీసులకు ప్రభుత్వం స్వేచ్ఛను ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూఆక్రమణలకు పాల్పడుతోందన్నారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచి పెట్టిందన్నారు కిషన్ రెడ్డి.
రైతు సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చారని, ధరణితో లక్షలాది మంది రైతులు, భూయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమి ప్రొబేటరీ ల్యాండ్ గా ప్రకటించడం వల్ల చాలామంది కోర్టుల చుట్టు తిరుగుతున్నారన్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకొని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరి బారినపడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు కిషన్ రెడ్డి.