మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగిందంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమని మనోహర్ అన్నారు. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు ఆయన. ఏపీ కి పవన్ కల్యాణ్ నాయకత్వం ఎంతో అవసరం ఉందని.. ఆ దిశగా అందరూ కలిసి పని చేయాలని పార్టీ నేతలకు కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ లో, దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టిందని నాదెండ్ల అన్నారు. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తేనే ఇలాంటి కార్యక్రమం చేయగలమన్నారు ఆయన. ప్రమాదవశాత్తు ఎవరైనా జనసైనికుడు చనిపోతే, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉందని, ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి వారికి అండగా ఉండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారని పేర్కొన్నారు.