ధరణి పోర్టల్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.లక్షలాది మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.దీని కారణంగా ప్రజలు నిరాశకు గురి అవుతున్నారన్నారు. పోర్టల్ కింద దాదాపు పది లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.దీని బట్టే ధరణి పోర్టల్ సమస్య ఎంత తీవ్రతరంగా మారిందనేది అర్థం అవుతుందని వెల్లడించారు.
న్యాయబద్దమైన ల్యాండ్ ను రాత్రికి రాత్రే ప్రొహిబిటరీ ల్యాండ్ గా రికార్డ్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిషన్ రెడ్డి
ఆరోపించారు. ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోందని.. ప్రగతి భవన్ కేంద్రంగా సెటిల్ మెంట్ జరుగుతోందని ఆరోపించారు. ధరణి ముసుగులో బీఆర్ఎస్ లీడర్లు భూ దందాకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధరణి భూ సమస్యల పరిష్కారం కోసమని ప్రభుత్వం చెప్పింది కానీ.. గులాబీ నాయకుల కోసమని తేలిపోయిందన్నారు కిషన్ రెడ్డి. ప్రజల భూములను ధరణి పేరుతో మధ్య దళారులు, పాలక పార్టీ నాయకులు కొట్టేస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. బ్రోకర్లను పెంచి పోషించడానికే ధరణి పోర్టల్ అని కోర్టులు కూడా చెప్పాయన్నారు.