నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వేల అధికార, విపక్షాల మధ్య వాద ప్రతివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కొత్త భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. అయితే రాష్ట్రపతిని కాదని ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు టిఎంసి, ఆప్, ఎన్సీపీ, జెడియు వంటి 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
కాగా టిడిపి, వైసిపి, ఎస్ఏడి, బీజేడి వంటి ఎన్డీయేతర పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాయి. ఇదిలా ఉంటే.. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయాల్సింది రాష్ట్రపతి అని.. కానీ నేనే చేస్తా అని మోడీ ఎందుకు పట్టుబడుతున్నాడని ప్రశ్నించారు. ఆగమశాస్త్రం ఒప్పుకోవడం లేదా..? లేక శుభకార్యాలు ముత్తైదువు చేయాలని.. రాష్ట్రపతి విధవ అని ప్రారంభోత్సవం చేయించడం లేదా..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.