లోక్‌సభ డిలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై ట్విటర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లోక్​సభ స్థానాల డీ లిమిటేషన్​పై మండిపడ్డారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను దక్షిణాది రాష్ట్రాలు నమ్ముతూ వచ్చాయని తెలిపారు. కేంద్రం మాటలు నమ్మి.. ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు వారి నిర్ణయం వల్ల తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు.

డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని తెలిపారు. ఇది నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news