తొమ్మిదేళ్ళుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్క్‌ పాలన

-

సుదీర్ఘకాలం ప్రజాస్వామ్య భారతదేశానికి ప్రధానిగా సేవలందించిన నాలుగో వ్యక్తిగా నరేంద్ర మోడీ…..జవహర్‌లాల్‌ నెహ్రూ,ఇందిరాగాంధీ,మన్మోహన్‌ సింగ్‌ సరసన నిలిచారు. మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమి మే 30వ తేదీతో తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. నోట్ల రద్దు,జీఎస్టీ,కొవిడ్‌ మహమ్మారి విజృంభణ,దేశ సరిహద్దుల్లోని రక్షణ వ్యవస్థలో తలెత్తిన సమస్యలు,ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ….. వంటివి ఉన్నప్పటికీ ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటూ సుసంపన్నభారత నిర్మాణానికి ఆయన చేస్తున్న కృషి నభూతో నభవిష్యత్‌ అనిపించుకుంది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్ధిక గమనంలో దేశ జీడీపీ పడిపోకుండా తీసుకున్న చర్యలు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందుకున్నాయి. కాంగ్రెసేతర వ్యక్తిగా దేశాన్ని ఇంత సుదీర్ఘకాలం పాలిస్తున్నారు నరేంద్ర మోడీ. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోడీ తీరును తప్పుబడుతున్నా చేసే పనిలో ఖచ్చితత్వం,ముక్కుసూటి వ్యవహారం,ప్రజా సంక్షేమం కోసం తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మోడీని స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా తిరుగులేని హీరోగా నిలబెట్టింది. ఇటీవల జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో ఐక్యరాజ్యసమితి తీరుని విమర్శిస్తూ మోడీ చేసిన ప్రసంగం ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసింది.

 

ఒక దేశానికి ప్రధానిగా ఉంటూ ఐక్యరాజ్యసమితిని ప్రక్షాళన చేయాలి అని వ్యాఖ్యానించడం వెనక మోడీ విధానాలేంటో,ఆయన ప్రభ ఏ స్థాయికి చేరుకుందో ఈ పాటికే దేశ ప్రజలకు అర్ధమై ఉంటుంది.ఓ వ్యక్తి సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి చేరడం వెనుక అవిరళ కృషి దాగి ఉంటుంది. తొమ్మిదేళ్ళ క్రితం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ ఆ రోజు ఏ సంకల్పం తీసుకున్నారో ఏమో ప్రపంచమంతా మోడీ నామ స్మరణ చేసే స్థాయికి చేరుకున్నారు. అసలు మోడీ ఈ తొమ్మిదేళ్ళలో ఈ స్థాయికి చేరడానికి దోహదపడిన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం….

 

గ్రామీణ భారతంలో మౌలిక సదుపాయాల కల్పన-

తొమ్మిదేళ్ళ కాలంలో మోడీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టిన వాటిల్లో మౌలిక సదుపాయల కల్పన ఒకటి. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు ఇలా ఏ రంగంలో చూసిన మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన ప్రాజె క్టుల సంఖ్యలోనూ, వాటి పరిమాణంలోనూ అనూహ్యమైన పెరుగుదల కనిపించింది.
ఇది గత కొద్ది సంవత్సరాలుగా వాటికి పెరుగుతున్న మూలధన పెట్టుబడిపై ప్రభావం చూపింది. జాతీయ రహదారుల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మోడీ సర్కారు విజయగాథల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అయితే బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు లాంటి పలు పెద్ద ప్రాజెక్టులు ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం జాతీయ రహదారుల నిడివి 97,830 కి.మీ.లు ఉండగా 2022 డిసెంబర్‌ మాసాంతానికి అది 1,44,955 కి.మీ.లకు చేరుకుంది.

ఒడిదుడుకుల్లో అనూహ్యమైన వృద్ధి రేటు

కిందటేడాది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ దేశాలు భారత్‌ కంటే ముందున్నాయి. అయితే ఇటీవల స్థూలజాతీయోత్పత్తి(జీడీపీ) పురోగతి అనూహ్యంగా ఒడిదుడుకులను చవిచూసింది. దీనికి ప్రధాన కారణంగా కొవిడ్‌-19 మహమ్మారి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ వలన అనేక ఒడిదుడుకులకు గురైంది. పాత రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సాక్షిగా నిలిచిన 2016-17 ఆర్థిక సంవత్సరం 8 శాతానికి పైగా వృద్ధి రేటు ఉండగా తర్వాతి సంవత్సరాల్లో తిరోగమనం బాట పట్టింది.

2018-19లో 6.45 శాతంతో 2019 -20లో 3.89 శాతంతో అది మరింత క్షీణించింది. కొవిడ్‌ లాక్‌ డౌన్‌ కాలంలో (2020-21 ఆర్థిక సంవత్సరంలో) వృద్ధి -5.83 శాతానికి పడిపోయింది. అయితే మోడీ తీసుకువచ్చిన సంస్కరణల వలన 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు పుంజుకుని 9.05 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఒక మధ్యేమార్గం అనుసరిస్తున్నట్టుగా 2022-23 ఆర్థిక సంవత్స రానికి వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. జీడీపీ తరహాలో తలసరి ఆదాయం కూడా అనూహ్యమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. గడచిన తొమ్మిది సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో వార్షిక వృద్ధి రేటు -8.86 శాతం నుంచి 7.59 శాతం మధ్య ఊగిసలాడింది.

భారీగా వచ్చిన ఎఫ్‌డిఐలు ( విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు )

మోడీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిన వాటిల్లో పెట్టుబడి రంగం ఒకటి. దేశీయ ఔత్సాహిక పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను(ఎఫ్‌డీఐలు) ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఆర్థిక వ్యవస్థకు చెందిన పలు రంగాల కోసం ఎఫ్‌డీఐ పాలసీ సరళీకరణ, శాసనపరమైన సంస్కరణలు, తదితర చర్యలను చేపట్టింది. ఈ చర్యలు కొన్ని ఫలాలను అందించాయి. ఉదాహరణకు 2014 -15 ఆర్థిక సంవత్సరానికి 45 బిలియన్‌ డాలర్లుగా నమోదైన ఎఫ్‌డీఐ. . . 2021-22 ఆర్థిక సంవత్సరానికి 84.83 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అయితే 2022-23 సంవత్సరానికి అది కాస్త తగ్గి 70 బిలియన్‌ డాలర్లకు పరిమితమైపోయింది.

గ్రామీణ భారతానికి ఉపాధి చూపిన ఎన్‌ఆర్‌ఈజిఎస్‌

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం(ఎన్‌ఆర్‌యీ జీఎస్‌) పనితీరు గ్రామీణ భారతంలో సంక్షోభానికి అద్దం పట్టే సూచికల్లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఇంట్లోను నైపుణ్యంతో సంబంధం లేని పనులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజనులకు 100 రోజుల ఉపాధిని కచ్చితంగా కల్పించే లక్ష్యంతో ఆ పథకం ప్రారంభమైంది. నానాటికి పెరిగిపోతున్న ఎన్‌ఆర్‌యీజీఎస్‌ లబ్దిదారుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4.41 కోట్ల కుటుంబాలు పథకాన్ని వినియోగించుకున్నాయి. 2020-21లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆ సంఖ్య గరిష్టంగా 7.55 కోట్లకు చేరుకుంది. ఆ కాలంలో పట్టణాలకు, నగరాలకు వలసపోయిన అనేక మంది ప్రజలు వారి స్వగ్రామాలకు తిరిగి చేరుకున్నారు. ఆ తర్వాత 2021-22 లో పథకాన్ని వినియోగించుకున్న కుటుంబాల సంఖ్య 7.25 కోట్లుగా ఉంది. అయినప్పటికీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 6.18 కోట్లుగా ఉంది.

అరకొరగా ఆరోగ్యం

ఎన్డీయే ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్ళల్లో ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటిగా కొవిడ్‌ మహమ్మారి నిలిచిపోతుంది. అయితే అందుబాటులో ఉన్న డేటా ప్రకా రం ఆరోగ్య రంగానికి చేస్తు న్న ఖర్చులో (జీడీపీ శాతం ప్రకారం) పెద్దగా మార్పు కనిపించలేదు. 201 4-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 మధ్య కాలంలో ఆరోగ్యానికి పెట్టిన ఖర్చు 1.2 శాతం నుంచి 2.2 శాతం మధ్య ఊగిసలాడింది. ప్రస్తుతం ఆరోగ్య రంగానికి చేసిన ఖర్చులో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 12 శాతానికి కాస్త ఎక్కువగా ఉంది. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ ఫర్‌ ఇండియా ప్రకారం ”ఆరోగ్య రంగానికి ప్రస్తుతం చేసిన ఖర్చులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 72,059 కోట్లు(12.14 శాతం), రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.1,18, 927 కోట్లు(20.03 శాతం), స్థానిక సంస్థల వాటా రూ.5,844 కోట్లు(0.99 శాతం), కుటుంబాల వాటా (ఇన్సురెన్స్‌ ప్రీమియంలను కలుపుకొని) దాదాపు రూ. 3,51, 717 కోట్లు(59.24 శాతం), అనూహ్యమైన ఖర్చు 52 శాతంగా ఉంది”.

కనిష్టంగా పన్ను-జీడీపి నిష్పత్తి,

పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్‌లో ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నల్లధనాన్ని అరికట్టడానికి, నగదు వాడకాన్ని తగ్గించడానికి ఆ నిర్ణయం చేపట్టింది. ఉదాహరణకు గడచిన తొమ్మిదేళ్లలో ప్రత్యక్ష పన్ను-జీడీపీ నిష్పత్తి 4.78 నుంచి 6.02 శాతం మధ్య నిలిచిపోయింది. అందుకు విరుద్ధంగా కరెన్సీ-జీడీపీ నిష్పత్తి 2014 -15 ఆర్థిక సంవత్సరంలో 11.6 శాతం నుంచి 2020-21 లో 14.4 శాతానికి పెరిగిపో యింది. అయితే 2021-22 లో 13.7 శాతంతో అది స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. యుపీఐ లాంటి కొత్త చర్యలతో డిజిటల్‌ లావాదేవీలకు ఊతమిచ్చినప్పటికీ నగదు వినియోగం ఇప్పటికీ వృద్ధిలో ఉందనే వాస్తవాన్ని పై గణాంకాలు సూచిస్తున్నాయి.

ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో కనిష్టం

గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం మేకిన్‌ ఇండియాపై దృష్టి పెట్టింది. కొవిడ్‌19 మహమ్మారి పీడించిన సమయంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ను ఆరంభించింది. అయితే తాజా డేటా ప్రకారం ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో భారత్‌ వాటా నిశ్చలంగా ఉంది. 2014లో 1.69 శాతం నుంచి కాస్త వృద్ధితో 1.77 శాతానికి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news