జూన్ 22న అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగం

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 22న యూఎస్ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. మోదీ గౌరవార్థం అగ్రరాజ్య అధినేత జో బైడెన్‌ 22వ తేదీన విందు ఇవ్వనున్నారు. అయితే అంతకు ముందు జరగనున్న కాంగ్రెస్ సమావేశంలో.. భారత్‌ భవిష్యత్తుకు సంబంధించి తన దృక్పథం, ప్రస్తుతం రెండు దేశాలు ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లు వంటి అంశాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశముంది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పలువురు అగ్రనేతలు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ల ద్వైపాక్షిక నాయకత్వం తరఫున ఈ నెల 22న కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు మిమ్మల్ని ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’’ అని అమెరికా కాంగ్రెస్‌ అగ్రనేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఇలాంటి అరుదైన ఘనత పొందిన నాయకుల్లో బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news