ఆనం వెంకటరమణారెడ్డి కార్యాలయం నుంచి కిందకు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన సుమారు ఎనిమిది మంది దుండగులు.. కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఆనం అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు సికిందర్ రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు అడ్డుకోవడంతో కర్రలు, ద్విచక్ర వాహనాలు అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనలో ఆనం వెంకట రమణారెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇటీవల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలపై, ముఖ్యమంత్రితో పాటు ఇతర నాయకుల అవినీతిపై ఘాటుగా మాట్లాడుతున్న నేపథ్యంలో దాడికి యత్నించారని ఆనం, టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి వైసీపీ మూకల పనే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతాం అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన ఇచ్చారు.