ఉక్రెయిన్​పై కోలుకోలేని దెబ్బ.. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేసిన రష్యా!

-

ఉక్రెయిన్​కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశానికి గుండెకాయలాంటి నోవా కఖోవ్కా డ్యామ్ పేలిపోయింది. ఇవాళ తెల్లవారుజామున నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేయడంతో.. నీటి వరద ముంచుకురావడం మొదలైంది. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కిమీ దూరంలోని ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. గత కొన్ని నెలలుగా ఈ డ్యామ్‌ సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ రష్యా దళాలే దీనిని పేల్చివేశాయని ఆరోపించింది.

ఈ డ్యామ్‌ పేల్చివేతతో స్థానికంగా ఉన్న ప్రజలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నీపర్‌ నదికి తూర్పు తీరాన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్‌ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అత్యవసరమైన పత్రాలు, నిత్యావసరాలు తీసుకొని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. మైఖోలావిక, ఓల్హిక, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి గ్రామాలను ఖాళీ చేయాలని సూచించారు. డ్యామ్‌ పేల్చివేతను ఉక్రెయిన్‌ అధికారులు పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించారు. డ్యామ్‌ విధ్వంసంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news