దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తాజాగా ఓ సభలో ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను తలచుకుని కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. దిల్లీలోని బవానాలో బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌లెన్స్ నూతన శాఖను బుధవారం.. కేజ్రీవాల్ ప్రారంభించారు. ఉత్తమ విద్య కోసం.. సిసోదియా చేసిన పనులను ఆయన గుర్తుచేశారు. తప్పుడు కేసులో సిసోదియాను.. జైల్లో పెట్టారని ఆరోపించారు.
‘ప్రతి చిన్నారికి ఉత్తమ విద్య అందాలని మనీశ్ సిసోదియా కల కన్నారు. అసత్య ఆరోపణలతో అంత మంచి వ్యక్తిని ఇన్ని నెలలు జైలులో పెట్టారు. ఆయన్ను ఎందుకు జైలులో పెట్టారు? దేశంలో పెద్ద పెద్ద దొంగలు బయట తిరుగుతున్నారు. వాళ్లను పట్టుకోవడంలేదు. పిల్లలకు ఉత్తమ విద్య అందాలని మంచి పాఠశాలలు నిర్మించినందుకు ఆయన్ని జైలులో పెట్టారు. మేము ఆయన కలను నెరవేరుస్తాం. ఆయన చేపట్టిన ఈ మంచి పనిని ఆపేదిలేదు.’ అంటూ కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు.