కవిత, ఎంపీ అవినాష్ రెడ్డి కేసులపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ అధినేత కేసీఆర్ గారి కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కేసులో ఇంకా అరెస్ట్ చెయ్యనందువల్ల… తెలంగాణలో అధికారం కోరుకుంటున్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్టేనంటూ వెలువడిన ఒక ప్రముఖ మీడియా కథనం పూర్తిగా అర్థరహితం అని ఫైర్ అయ్యారు. కవిత అరెస్ట్ అయితేనే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కుతుందన్నట్టుగాను… అలా జరగకపోతే తెలంగాణ రాష్ట్రంలో కమలదళానికి నిరాశేనన్నట్టుగా వెలువడిన ఆ కథనం, దీని ఆధారంగా చానెల్‌లో చేపట్టిన చర్చ పూర్తిగా గాడి తప్పిన విషయంగా చెప్పుకోవాలన్నారు.
పైగా ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానందగారి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని… తెలంగాణలో కవితను అరెస్ట్ చెయ్యకుండా ఉండటానికి బీజేపీ అంగీకరిస్తే… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌కి మార్గం సుగమం చేసేలా అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడానికి ఒప్పించడంలో పాత్ర పోషించేందుకు ఏపీ సీఎం జగన్ గారు కేంద్ర పెద్దలకు హామీ ఇచ్చినట్టు నడిచిన ఈ కథనం అంటూ చెప్పుకొచ్చారు.
చర్చ హాస్యాస్పదం కాక మరేమీ కాదు. ఉత్తరాదిలో ఎదిగిపోతున్న కేజ్రీవాల్‌గారిని కట్టడి చేసేందుకే బీజేపీ ఇదంతా చేస్తోందనడం ఎంత అపరిపక్వత అనేది… ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లలోని మొత్తం ఎంపీ స్థానాలెన్నో తెలుసుకుంటే అర్థమవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలతో పోల్చితే ఆ సంఖ్య ఎంత? కేవలం కొద్దిపాటి ఎంపీల కోసమే కేజ్రీవాల్ గారి అరెస్ట్ వ్యూహం నడుస్తోందని సూత్రీకరించడం కరెక్టేనా?… సమకాలీన రాజకీయాల గురించి ఏ కాస్త తెలిసినవారికైనా ఆ విశ్లేషణ స్థాయి ఏంటన్నది బాగా స్పష్టమవుతుందని చురకలు అంటించారు విజయశాంతి.