రైతులకు కేంద్ర సర్కార్ తీపికబురు అందించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధర రూ.2,183గా నిర్ణయించింది. ఈ మేరకు.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచింది.
ఏ గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధరను 163 రూపాయల మేర పెంచిన కేంద్రం, ఆ గ్రేడ్ ధరను.. రూ. 2,203 రూపాయలుగా ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ. 8,558గా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభయదాయకంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే హరియాణా.. గురుగ్రామ్‌లో 28.5 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని గోయల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.5,452 కోట్లు కేటాయించిందని పేర్కొంది.