వైసీపీకు ఎమ్మెల్యే తృటిలో తప్పిన ప్రమాదం

-

కృష్ణాజిల్లా తిరువూరు వైసిపి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఏపీలో ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా పథకం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తుండగా ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రైతు భరోసా ప్రారంభిస్తున్న సందర్భంగా తిరువూరులో వైసిపి కార్యకర్తలు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎడ్లబండి మీద ఎమ్మెల్యే రక్షణ నిధి ర్యాలీలో పాల్గొన్నారు.

కొంత దూరం వరకు ర్యాలీ బాగానే సాగింది అయితే తిరువూరు సెంటర్‌కు వచ్చేసరికి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో వస్తుండడంతో ఎద్దులు బెదిరిపోయాయి. దీంతో అవి ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. దీంతో బండి మీద ఉన్న రక్షణ నిధి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కార్యకర్తలు సైతం ఎద్దులు అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన బండి మీద నుంచి పడిపోతానేమోనని భయాందోళనకు గురయ్యారు. రెండు ఎద్దులు రెండు సార్లు గాల్లోకి ఎగురుతూ పరుగులు పెట్టాయి.

ఎమ్మెల్యేతో పాటు బండి మీద ఉన్న మిగిలిన కార్యకర్తలు సైతం ఒక్కసారిగా హడలిపోయారు.చివరకు ఎద్దులపై పట్టు సాధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో బండి ఆపి కార్యకర్తలు ఎడ్లబండి మీద నుంచి ఎమ్మెల్యే రక్షణ నిధిని కిందకు దించారు. అదే స్పీడ్ తో మరి కొంచెం దూరంగా వెళ్లి ఉంటే కచ్చితంగా డివైడర్ కు ఢీ కొట్టి ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news