ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను బహానగా ప్రభుత్వ పాఠశాలలో భద్రపర్చారు. ఇప్పుడు ఆ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ పాఠశాల భవనాన్ని తాజాగా కూల్చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్కూల్‌ను శుభ్రం చేశారు. అనేక మృతదేహాలను ఒకే చోట చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ స్కూల్‌ను జూన్ 16న తిరిగి తెరవనున్నారు. అయితే, పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ధైర్యం చేయట్లేదని, వారి తల్లిదండ్రులు చిన్నారులను పంపించేందుకు నిరాకరిస్తున్నారని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు. దీంతో ఈ స్కూల్ భవనాన్ని కూల్చాలని పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ నేపథ్యంలోనే బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ శిందే గురువారం స్కూల్‌కు వెళ్లి పరిశీలించారు. అనంతరం కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ భవనాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ ప్రదేశంలోనే మరో కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అప్పుడు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా వస్తారని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
Bahanaga High school, students are too scared & traumatized to go back to this school where the bodies were kept after the train accident. Parents have asked to demolish it.#BahanagaTrainAccidentpic.twitter.com/1OqA8vmMgv
— Priyathosh Agnihamsa (@priyathosh6447) June 9, 2023