ఉన్నత చదవుల కోసం.. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్న యువత.. అక్కడ జరుగుతున్న ప్రమాదాలు.. కాల్పులు.. ఇతర ఘటనల్లో అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన యువతి లండన్‌లో హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లిన తేజస్విని.. బ్రెజిల్ యువకుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఓ ఫ్లాట్‌లో ఉంటోంది.
ఈ క్రమంలో తేజస్వినితో పాటు ఆమె స్నేహితురాలిపై నిందితుడు దాడి చేశాడు. ఈ ఘటనలో తేజస్విని చనిపోగా స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్ పూర్తిచేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.