తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ బర్తరఫ్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. మంత్రిగా సెంథిల్ బాలాజీ బర్తరఫ్ ఉత్తర్వులను నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని సీఎం స్టాలిన్‌కు కూడా గవర్నర్ తెలియజేశారని తెలిపాయి. అటార్నీ జనరల్‌ను సంప్రదించి.. సెంథిల్ బాలాజీ అంశంపై గవర్నర్ న్యాయసలహా తీసుకుంటారని సమాచారం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గవర్నర్ తాత్కాలికంగా సెంథిల్ బాలాజీ ఉద్వాసన నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు మంత్రి సెంథిల్ బాలాజీని గవర్నర్ RN రవి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమిళనాడు రాజ్ భవన్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. బాలాజీ మనీలాండరింగ్ సహా అనేక కేసుల్లో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా ఉంటే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బర్తరఫ్ చేస్తున్నట్లు రాజ్ భవన్ స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయంపై అధికార డీఎంకే మండిపడింది. గవర్నర్‌కు అలాంటి హక్కు లేదన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. న్యాయపరంగా పోరాడతామని ప్రకటించారు. పలు పార్టీలు కూడా డీఎంకేకు మద్దతు ప్రకటించాయి.