ఎడిట్ నోట్: కమలంలో కుమ్ములాటలు.!

-

మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కలహాలు, కుమ్ములాటలు జరిగేవి..కానీ ఇప్పుడు బి‌జే‌పిలో ఆ రచ్చ నడుస్తుంది. కాంగ్రెస్ లో అంతర్గత సమస్యలు ఉన్న వాటిని పక్కన పెట్టి..పార్టీని గెలిపించే దిశగా నేతలు పనిచేస్తున్నారు. కానీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బి‌జే‌పిలో ఇప్పుడు కలహాలు నడుస్తున్నాయి. ఇటీవల కీలక మార్పులు పార్టీలో చిచ్చు పెట్టాయి. అలాగే కొందరు నేతల మధ్య సఖ్యత లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఇటీవల బి‌జే‌పి ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి..బండి సంజయ్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బండి అధ్యక్ష పదవి కోల్పోయారు. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వచ్చింది. ఇటు ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ పదవి రాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ వర్గంలో ప్లేస్ ఇచ్చారు. ఈ పదవులు వచ్చిన సరే..ఆ నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. అటు అధ్యక్ష పదవి పోవడంపై బండి వర్గం అసంతృప్తిగా ఉంది. ఇలా మార్పుల వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు.

ఇదే సమయంలో రఘునందన్.. ఈ మధ్య బండిపై చేసిన వ్యాఖ్యలు..దుబ్బాక ఉపఎన్నికలో తన ఇమేజ్ తో గెలిచానని చెప్పిన మాటలు ఇప్పుడు బి‌జే‌పి లో ఓ వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా రఘునందన్ సొంత జిల్లా మెదక్ కు చెందిన బి‌జే‌పి నేతలు..రఘునందన్ పై ఫైర్ అవుతున్నారు. గతంలో తమకు పదవులు రాకున చేసి..తమపై కోవర్టులు అని ముద్రవేసిన రఘునందన్ ఇప్పుడు చేసే పని ఏంటని..ఆయనే పెద్ద కోవర్టుగా ఉన్నారని బి‌జే‌పి నేతలు గిరీశ్‌ రెడ్డి, సంజీవరెడ్డి మండిపడుతున్నారు.

ఇక ‘రఘునందన్‌ కో హఠావో.. బీజేపీకో బచావో’ అనే నినాదంతో కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. దీంతో బి‌జే‌పిలో కలకలం రేగుతుంది. ఇదే సమయంలో వరంగల్ జిల్లాలో మోదీ పర్యటన ఉండగా…అక్కడ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాణా ప్రతాప్ వర్గాలు గొడవపడ్డాయి. అక్కడ బి‌జే‌పి ఆఫీసుని ధ్వంసం చేశారు. ఇలా కమలంలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news