తెలంగాణలోని హుజూర్‌నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కారు జోరు ముందు మిగిలిన పార్టీలు బేజారు అయ్యాయి. ఇక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రచారానికి వెళ్లకుండా ఓ స్థానంలో టీఆర్ఎస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక హుజూర్‌నగర్లో పార్టీ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించడంతో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ హర్షం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఏకంగా 43,233 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ప్రతికూల వాతావరణం వల్ల తాను ఎన్నికల సభకు హాజరుకాలేపోయినా హుజూర్ నగర్ ప్రజలు భారీ మెజార్జీతో టీఆర్ఎస్ ను గెలిపించారని కేసీఆర్ చెప్పారు. హుజూర్ నగర్ ప్రజల ఆశాలను నెరవేర్చుతామన్నారు. ఎల్లుండి హుజూర్ నగర్‌లో సభను నిర్వహిస్తామని సీఎం కేసీర్ తెలిపారు. ఈ క్రమంలోనే బీజేపీపై కేసీఆర్ తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతైన సంగతి తెలిసిందే.
బీజేపీ పెట్టే పెడబొబ్బలకి వాళ్లకు వచ్చిన ఓట్లకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు. బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే నవ్వాలో ఏడవాలో వాళ్లకే అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తమపై అపనిందలు వేసి ఆ పార్టీ వాళ్లు పెద్దవాళ్లు అవుదామనుకున్నారని, ప్రజాస్వామ్యంలో అహంభావం, అహంకారం మంచివి కాదని కేసీఆర్ సూచించారు. ఏదేమైనా హుజూర్‌నగర్ తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.
ఇక తాను ప్రతికూల పరిస్థితుల్లో హుజూర్‌నగర్ వెళ్లకపోయినా ప్రజలు అద్భుతమైన మెజార్టీ ఇచ్చారని… ఈ తీర్పు తమకు టానిక్‌లా పని చేస్తుందని….గతంలో హుజూర్‌నగర్‌లో 7 వేల మెజార్టీతో ఓడిపోయాం. ఇప్పుడు 43 వేలకుపైగా మెజార్టీ రావడం మామూలు విషయం కాదని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా పని చేస్తే సంతోషిస్తామని కూడా ఆయన తెలిపారు.
ఇక ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ మాట్లాడుతూ వాళ్లు పిచ్చి పంథా ఎంచుకున్నారని… భారతదేశ చరిత్రలో, ఏ ఆర్టీసీ చరిత్రలో 4 ఏళ్ల కాలంలో 67 శాతం జీతాలు పెంచిన ఘనత ఎవరికైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ఇంత పెంచిన తర్వాత కూడా గొంతెమ్మ కోరికలు కోరుతామంటే అర్థం లేదని విమర్శించారు.