ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అందుకే విస్తృతస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పురందేశ్వరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. ఈ నెల 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో భేటీ అవనున్నారు. ఈ నెల 26న రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలను కలుసుకోనున్నారు. ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో పురందేశ్వరి సమావేశం జరపనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శ్రేణులను ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని పురందేశ్వరి భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వాలంటీర్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారని ఆమె తెలిపారు. అయితే వాలంటీర్లను కూడా కలుపుకుని ఉపాధి కల్పించామని ప్రభుత్వం లెక్కలు చూపిస్తోందని పురంధేశ్వరి చెప్పారు. విజయవాడలో ఆమె అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలన చేస్తోందని మండిపడ్డారు. మద్యం డిస్టిలరీస్ అన్ని అధికార పార్టీ సన్నిహితులకే ఇచ్చారని పురంధేశ్వరి ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో భారీ స్కాం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరిగే పరిస్థితి లేదన్నారు. టెన్త్ విద్యార్థిని పట్టపగలు టీచర్ చంపేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ యాప్ నొక్కితే పోలీసులు వచ్చే పరిస్థితుల్లో లేరని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.