ఏపీలో వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. జగన్ ను జైలుకు పంపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు చెబుతున్నారని, తాను జనసేనానికి సవాల్ విసురుతున్నానని… డేటా చౌర్యం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ఎవరితోనైనా విచారణకు సిద్ధమని పేర్ని నాని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… పవన్ కు దమ్ముంటే, చేతనైతే నీకు ఇష్టం వచ్చిన సంస్థతో లేదా కేంద్ర సంస్థతో విచారణ చేయించుకోవచ్చునన్నారు. మోదీ తన చేతిలో ఉన్నారని, అమిత్ షా తన చేతిలో ఉన్నారని చెబుతున్నారని, నీకు బీజేపీతో బంధం ఉంది కదా.. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అమిత్ షాతో మాట్లాడానని చెబుతున్నారని, ఆయనతో మాట్లాడితే నీవు అంత గొప్పనా? అని నిలదీశారు. సై అంటే సై.. నీకు చేతనైంది చేసుకో అని సవాల్ చేశారు. అమిత్ షాతో మాట్లాడితే ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. మీకు చేతనైతే మీ ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. అఖండ ప్రజలు కోరుకుంటే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని పవన్ చెబుతున్నారని, అఖండ ప్రజలు అంటే ఎవరు? అఖండ సినిమానా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ పెద్దలతో నీకు సత్సంబంధాలు ఉంటే ఎవరికి ప్రయోజనమని, ఏపీకి ఏమైనా తీసుకు వచ్చావా? అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు… తీసుకు రావడం లేదన్నారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.