తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. అ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసల జోరు కొనసాగుతుంది. అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. అలాగే సీనియర్లు మొత్తం కలిసికట్టుగా పనిచేస్తూ..కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే అంతా బాగుంటే అది కాంగ్రెస్ పార్టీ అవ్వదు. ఎప్పుడు ఏదొక విధంగా విభేదాలు, అంతర్గత పోరు జరగాల్సిందే. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ అంశం పెద్ద రచ్చ లేపుతుంది.
రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్న ఈ కమిటీలో 26 మంది సీనియర్లకు అవకాశం ఇచ్చారు. కానీ కొంతమందికి ఛాన్స్ రాలేదు. అలా ఛాన్స్ రాని వారిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. ఈయన వర్గం ఇటీవల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిరసన తెలియజేసింది. అలాగే పొన్నం కూడా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆయనకు వేరే విధంగా న్యాయం చేస్తామని రేవంత్ అంటున్నారు. అయినా పొన్నం అసంతృప్తిగానే ఉన్నారు.
దీంతో ఆయన పార్టీ మారిపోతున్నారని ప్రచారం వస్తుంది. బిఆర్ఎస్ లోకి వెళ్తారని కథనాలు వస్తున్నాయి. మొన్న ఆ మధ్య అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం వచ్చింది. అది వాస్తవం కాదని, తనపై కొందరు కుట్ర పన్నారని ఉత్తమ్ అన్నారు. ఇప్పుడు పొన్నం పార్టీ మారుతున్నారని ప్రచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియడం లేదు.
ఇక ఇటు సీనియర్ నేతలు చిన్నారెడ్డి, కుసుమ కుమార్ లకు సైతం చోటు దక్కలేదు. దీంతో వారు కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. మరి వారు కూడా పార్టీ మారిపోతున్నారనే ప్రచారం వస్తుందేమో చూడాలి. అయితే ఉత్తమ్, పొన్నం..వీరిపై ప్రచారం తప్ప…పార్టీ మారే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తుంది. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి వెయిట్ అండ్ సీ.