గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉద్ధృతి పెరుగుతుండడం పట్ల గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరి నీటి మట్టం 15.9 అడుగులకు చేరుకుంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 16.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పంట కాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ వైపు వస్తుండడంతో బ్యారేజీ వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. 17.75 అడుగులకు నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. బ్యారేజీ నుంచి 16.20లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.