కోకాపేట.. మోకిల.. షాబాద్.. ఇలా ఎక్కడ హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్మకానికి పెట్టినా సరే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. కోట్లల్లో ఆదాయం వస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా షాబాద్ లే అవుట్లలో నిర్వహించిన ఈ-వేలానికి కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని లేఅవుట్‌లో 50 ప్లాట్ల కోసం హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు.
మొత్తం 100 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 50 ప్లాట్లను(15,000 చదరపు గజాలు) మంగళవారం ఈ-వేలం వేశారు. ఇందులో చదరపు గజానికి ధర రూ.10 వేలుగా కనీస ధరగా చూపారు. గరిష్ఠంగా రూ.27 వేలకు, సరాసరి ధర రూ.22,040 పలికాయి. ఇక కనీస ధర రూ.18 వేలు వంతున కొనుగోలు చేశారని హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 15,000 చదరపు గజాల స్థలానికి కనీస ధర రూ.15 కోట్లుగా నిర్ణయిస్తే.. రూ.33.06 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొంది.