తెలంగాణలో అన్నీ జిల్లాలపై బిఆర్ఎస్ పార్టీకి పట్టు ఉంది..కానీ ఒక్క ఖమ్మంలోనే బిఆర్ఎస్కు సరైన పట్టు దొరకడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బొటాబోటి మెజారిటీతో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాక…కేసిఆర్..పూర్తిగా టిడిపి నేతలని, కేడర్ని బిఆర్ఎస్ వైపుకు లాగారు. అటు కాంగ్రెస్‌ని కొంతవరకు దెబ్బతీశారు. దీంతో అన్నీ జిల్లాల్లో బిఆర్ఎస్కు ఆధిక్యం వచ్చింది.
కానీ ఖమ్మం జిల్లాలో ఆధిక్యం సాధించడంలో విఫలమవుతుంది. గత రెండు ఎన్నికల్లో అదే పరిస్తితి. గత ఎన్నికల్లో మాత్రం దారుణం..రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటిన ఖమ్మంలో మాత్రం కారు ఢీలా పడింది. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే బిఆర్ఎస్కు ఒక్క సీటు దక్కింది. 6 కాంగ్రెస్, 2 టిడిపి, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. కానీ తర్వాత కాంగ్రెస్ నుంచి నలుగురు, ఇద్దరు టిడిపి, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బిఆర్ఎస్ లోకి తీసుకున్నారు. అలా ఖమ్మంపై పట్టు సాధించారు. అయినా సరే అక్కడ కాంగ్రెస్ బలంగానే ఉంది.
అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైన నేత కాంగ్రెస్ వైపు వెళ్ళడంతో బిఆర్ఎస్కు మళ్ళీ దెబ్బతగిలింది. ఆయనతో పాటు కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో పొంగులేటికి దెబ్బకొట్టి..కాంగ్రెస్ లోకి వెళ్ళిన కొందరు నేతలని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి..ఈ సారి ఖమ్మంలో ఆధిక్యం సాధించాలని కేసిఆర్ చూస్తున్నారు.
ఇప్పటికే పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లోకి వెళ్ళిన తెల్లం వెంకట్రావుని మళ్ళీ బిఆర్ఎస్ లోకి తీసుకొస్తున్నారు. అలాగే కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు లాంటి కీలక నేతలని వెనక్కి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ సారి ఖమ్మంలో 6 సీట్లు గెలవాలని కేసిఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇంకా కష్టపడితే 8 సీట్లు వస్తాయని చెబుతున్నారు.
అయితే బిఆర్ఎస్కు ఆ పరిస్తితి లేదు..ప్రస్తుతం 3 సీట్లలోనే కాస్త ఆధిక్యం ఉంది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ ప్రభావం ఉంది. ఇక కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే బిఆర్ఎస్కు కాస్త కలిసిరావచ్చు. కానీ ఖమ్మంలో కాంగ్రెస్‌కు చెక్ పెట్టడం కాస్త కష్టమే.