నిర్మల్‌లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మహేశ్వర్‌రెడ్డి దీక్షకు బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి పేరిట సీఎం కేసీఆర్ అన్ని రకాల దోపిడీకి తెరలేపారన్నారు. నిరుపేద భూములను లాక్కోవడానికే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని మండిపడ్డారు.
తామేమీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ, రైతుల కళ్లలో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తుండడం బాధాకరమని ఈటల పేర్కొన్నారు. రింగ్ రోడ్డు ఎటు వస్తుందో తెలుసుకుని, రైతుల నుంచి ముందే తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు బాగుపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ వచ్చాక కొత్త రూపం ఎత్తారని, భూములు అమ్ముకుంటూ బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారని ఈటల పేర్కొన్నారు.