ఎడిట్ నోట్: మూడు పార్టీలు..మూడు లిస్టులు.!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. మరో నెల తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ లోపే ప్రధాన పార్టీలు అభ్యర్ధులని ఫిక్స్ చేసుకునే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా షెడ్యూల్ వచ్చాక అభ్యర్ధులని ఖరారు చేసే పనిలో ఉంటారు. కానీ ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసి..ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరిచే ఎన్నికల రంగంలోకి దిగాలని అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు, కాంగ్రెస్, బి‌జే‌పిలు చూస్తున్నాయి.

మూడోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కే‌సి‌ఆర్..ఇప్పటికే అభ్యర్ధుల లిస్ట్ ప్రిపరేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 21న సూర్యాపేటలో భారీ సభ నిర్వహించిన తర్వాత అభ్యర్ధుల మొదట లిస్ట్‌ని ప్రకటిస్తారని తెలుస్తోంది. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ ని విడుదల చేస్తున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ..వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక వివాదాలు, ఇద్దరు, ముగ్గురు పోటీ పడే సీట్లని తర్వాత ప్రకటిస్తారని తెలిసింది. మొత్తం బి‌ఆర్‌ఎస్..ఫస్ట్ లిస్ట్ మరో మూడు రోజుల్లో రానుంది.

ఇక కాంగ్రెస్ సైతం అభ్యర్ధుల ఎంపిక విషయంలో దూకుడుగా ఉంది. సాధారణంగా నామినేషన్లకు ఈ రోజు లాస్ట్ అంటే అప్పుడు కూడా అభ్యర్ధులని ఖరారు చేసే కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ముందుగానే అభ్యర్ధుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్ధులు..ఓసీ, బి‌సిలు రూ.50 వేలు ఫీజు కట్టి దరఖాస్తు పెట్టుకోవాలని, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ వర్గాలు రూ.25 వేలు కట్టి దరఖాస్తులు పెట్టుకోవాలని కండిషన్ పెట్టింది.

ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందులో ఒకో నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్ధులని ఎంపిక చేసి..ఫైనల్ గా అభ్యర్ధిని ఎంపిక చేసే ఛాయిస్ అధిష్టానానికి ఇవ్వనున్నారు. ఈ నెలాఖరున కాంగ్రెస్ సైతం మొదట లిస్ట్ ప్రకటించనుంది.  ఇక బి‌జే‌పి సైతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో మొదట లిస్ట్ విడుదల చేసింది. ఈ నెలాఖరుకు 25 మందితో తెలంగాణ ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనుందని తెలిసింది. మొత్తానికి మూడు పార్టీలు ఈ నెలలోనే మొదట లిస్టులని ప్రకటించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news