ఈనెల 27 రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరిగే రైతు సభలో అమిత షా మాట్లాడుతారు అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యావత్ తెలంగాణను మోసం చేస్తోందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సమగ్రమైన పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు.
రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారన్నారు. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించడం లేదన్నారు. రైతుల సమస్యలన్నింటికి రైతు బంధు పరిష్కారం కాదని తెలిపారు. తెలంగాణలోని లక్షలాది కౌలు రైతుల పరిస్థితి ఏమిటన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.
కేసీఆర్ తొలి కేబినెట్లో మంత్రి లేకుండా అయిదేళ్లు పాలించారని, టిక్కెట్‌లు ఇవ్వడంలోను మహిళలకు ప్రాధాన్యత లేదన్నారు. అలాంటి వారికి విమర్శించే హక్కు లేదన్నారు. అమిత్ షా పర్యటన గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కేంద్ర హోంమంత్రి విజయవాడకు వస్తారని, అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా భద్రాచలం వచ్చి, శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారని తెలిపారు. ఆ తర్వాత ఖమ్మంలో రైతు గోస.. బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.