తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. బీజేపీ కూడా సెప్టెంబర్ 4 నుండి 10వ తేదీ వరకు ఆశావహ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టనుంది.
ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులను స్వీకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించేవాళ్లు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు క్యూ కట్టారు. దరఖాస్తులు వెల్లువగా వచ్చాయి. ఒక్కో నియోజకవర్గానికి డజన్ల కొద్దీ దరఖాస్తులు రావడం కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది. వారసులతో కలిసి సీనియర్లు దరఖాస్తులను దాఖలు చేయడం విచిత్రం.
కొందరు వారసులతో దరఖాస్తులు చేయించారు. మరికొందరు సకుటుంబ సమేతంగా దరఖాస్తు చేసుకున్నారు. టిక్కెట్లను ఆశిస్తోన్న వాళ్ల సంఖ్య పెరగడంతో గాంధీభవన్ రద్దీగా మారింది. గడువు ఈనెల 25వ తేదీతో ముగిసింది. సుమారు 1000 పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 119 నియోజకవర్గాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆ పార్టీకి ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది.