తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం చేరి జలకళను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళతో నిండుకుండలా మారాయి.
గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులోకి 99,920 క్యూసెక్కుల వరదనీరు వస్తోందని అధికారులు తెలిపారు. దీంతో 26 గేట్ల ద్వారా 85,840 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు.. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,091 అడుగుల గరిష్ఠస్థాయి నీటిమట్టం ఉంది.