అసోం సీఎం సతీమణికి రూ.10 కోట్ల రాయితీ.. ట్విటర్​లో కాంగ్రెస్ ఆరోపణలు

-

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శల జల్లు కురిపించింది. ఆయన భార్య తన కంపెనీ కోసం కేంద్రం నుంచి రూ.10 కోట్ల రాయితీ పొందారని ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ తన భార్య, ఆమె కంపెనీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక రాయితీ పొందలేదని స్పష్టం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం.. అసోం సీఎం భార్య రినికి భుయాన్ శర్మకు చెందిన కంపెనీ ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల మేర రుణ ఆధారిత రాయితీ పొందిందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్​ గొగొయ్ ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండిస్తూ తన భార్య కంపెనీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక రాయితీ పొందలేదని ట్వీట్‌ చేశారు.

కానీ సీఎం సమాధానంతో గౌరవ్ గొగొయ్ సంతృప్తి చెందలేదు. కేంద్ర మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో రినికి భుయాన్‌ పేరు, కంపెనీ పేరు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి రూ.10 కోట్ల సబ్సిడీ పొందిన కంపెనీలు, ప్రమోటర్ల జాబితాను సూచించే వెబ్‌సైట్ లింకును ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన పత్రాల గురించి సీఎం స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news