స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబుకి తమిళ హీరోలు మద్దతుగా నిలుస్తున్నారు. బాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ చిత్రసీమలోని పెద్దలంతా మౌనం వహిస్తున్న వేళ.. కోలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా తెరపైకి వచ్చి బాబుకి సంఘీభావం ప్రకటిస్తుండడం హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు అరెస్టును ఖండించాలని టీడీపీతో పాటు ఎల్లోమీడియా పదేపదే సినీ పెద్దలను బతిమాలినా పట్టించుకున్న పాపాన పోలేదు. బాబు అరెస్టును తప్పు పడుతూ ప్రకటన చేసింది రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నట్టి కుమార్ తప్ప మరొకరు ఆ జాబితాలోనే లేరు. వీరంతా చంద్రబాబు హయాంలో లాభపడ్డ వాళ్ళే. అందువల్లే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, వైసీపీ ప్రభుత్వంపై నిందలేస్తూ వచ్చారు.
ఇక సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. జైలులో చంద్రబాబు భద్రతపై అనుమానం వ్యక్తం చేశారే తప్ప, అరెస్టును ఖండించలేదు. తాజాగా నిర్మాత సురేష్ బాబు కూడా చంద్రబాబు అరెస్టుపై ఆచితూచి మాట్లాడారే తప్ప, ఆయనను వెనకేసుకు రాలేదు. ఇది సున్నితమైన రాజకీయ అంశం కావడంతో స్పందించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. తాము సినిమాలు చేసుకునే వాళ్ళమే తప్ప రాజకీయాలను తమకు ముడి పెట్టొద్దంటూ ఉన్న మాట చెప్పేశారు. చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్, నాగార్జున, రాంచరణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు, దర్శన నిర్మాతలు కూడా బాబు అరెస్టుపై మౌనంగానే ఉండిపోయారు.
అయితే చంద్రబాబు అరెస్టును కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా తప్పు బట్టారు. బాబు పోరాటయోధుడు అంటూ కితాబిచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లోనూ చంద్రబాబును ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు. బాబును కలుస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు మరో హీరో విశాల్ కూడా చంద్రబాబుకు మద్దతివ్వడం వైరల్ అవుతోంది. చంద్రబాబు గొప్ప నాయకుడని… అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే టాలీవుడ్ పరిశ్రమ స్పందించాల్సిన విషయమిది. కానీ స్పందించడం లేదంటే చంద్రబాబుపై అంతోఇంతో వ్యతిరేకత ఉందనే కదా అర్ధం చేసుకోవాలి.
అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన వ్యక్తికి సపోర్ట్ చేస్తే.. ప్రజల్లో తమకు ఉన్న పేరు కూడా పాడవుతుందని టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతమాత్రాన చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడలేదని తెలుగు సినీ పరిశ్రమపై టీడీపీ వర్గం ఫైర్ అయితే ఎలా ? చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటం అనేది ఎవరి ఇష్టం వారిదే అనుకోవాలి. అంతేతప్ప మాట్లాడమని ఒత్తిడి చేయడం, మాట్లాడని వాళ్ళను తప్పుపట్టడం ఎంత వరకు కరెక్ట్. ఇదే చాలామందికి నచ్చని విషయం. ఎల్లో మీడియా కూడా తెలుగు సినీ పెద్దల గురించి ఇవే రాతలు రాస్తూ, కధనాలు ప్రసారం చేస్తూ హడావుడి చేస్తోంది. నందమూరి కుటుంబంలోని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంతవరకు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదన్న విషయం టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలి.