ఇండియాలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరోసారి గుర్తింపు పొందింది. గతేడాది లాగే.. దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టీసీఎస్ ఈ ఏడాది కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ విషయాన్ని మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కంటార్ నివేదిక వెల్లడించింది. టీసీఎస్ బ్రాండ్ విలువ 43 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది. బిజినెస్ టెక్నాలజీ కేటగిరీలో కఠినమైన పరిస్థితులు ఉన్నా.. టీసీఎస్ ఈ ఘనత సాధించినట్లు తెలిపింది.
అయితే గతేడాది కంటే టీసీఎస్ బ్రాండ్ విలువలో 6 శాతం క్షీణత నమోదైనట్లు కంటార్ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు, మందగమన భయాలు, భౌగోళిక రాజకీయాల అనిశ్చితులు ప్రభావం చూపినట్లు వివరించింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువలోనూ 17 శాతం క్షీణత కనిపించినట్లు పేర్కొంది. బ్రాండ్‌ల విలువ విషయంలో భారత్ బలంగా ఉందని కంటార్ నివేదికలో తేలింది. బ్రాండ్ల విలువలో ప్రపంచవ్యాప్త 20 శాతం క్షీణత కనిపిస్తే.. భారత్‌లో మాత్రం నాలుగు శాతమే నమోదైందని వెల్లడించింది.