ప్రస్తుత పరిణామాలు టిడిపిని సందిగ్ధంలోకి నెట్టేశాయని చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలు లో ఉన్నారు. లోకేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బయటకు వచ్చి నిరసనలు తెలియజేయమని పిలుపునిస్తున్నారు.
కానీ ఇన్ని సంవత్సరాల నుండి పార్టీ నీడన ఉండి లాభం పొందిన ఒక్కరు కూడా ఇప్పుడు ఆ పార్టీకి గాని, కుటుంబానికి గాని అండగా నిలబడాలని ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. ఏదో చేశామంటే చేశామని నిరసనలు, రిలే దీక్షలు అంటూ ఒకరోజు ఒక పూటతో ఆపేస్తున్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం నాయకులు ఒకటి రెండు జిల్లాలలో తప్ప సరిగా నిరసన తెలిపిన ప్రాంతాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వీరందరూ కలిసి చంద్రబాబునాయుడు అరెస్టులకు నిరసనగా ఒక కార్యక్రమం చేస్తే రాష్ట్రమే కాదు దేశమంతా వీరి వైపు చూసేలా చేయగల సత్తా వీరి దగ్గర ఉంది. కానీ వీరందరూ తలో దిక్కున ఉన్నారు. ఎంపీ కేసీనేని నాని ఎవరితోనూ కలవరు వారిని ఎవరూ కలుపుకోకపోవడం వలన కృష్ణాజిల్లాలో గ్రూపులు ఏర్పడ్డాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు కలిసి పనిచేస్తే టిడిపికి ఎదురు నిలిచే వారే ఉండరని అందరికీ తెలిసిందే.
అశోక్ గజపతిరాజు కూడా జిల్లాలోని నేతలను కలుపుకుంటే టీడీపీకి బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరో ఒకరు పార్టీకి అండగా నిలబడి ముందుకు నడపాల్సిన ఈ పరిస్థితులలో కూడా ఎవరికి వారు ఎవరో చేస్తారులే అని చూస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్టీ ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా టిడిపి నాయకులు వర్గపోరు పక్కన పెట్టకపోతే ఎలా అని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు సైతం అంటున్నారు.