తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో..ఇంకా ప్రధాన పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్ అభ్యర్ధులని ప్రకటించగా, కాంగ్రెస్, బిజేపిలు సీట్లు ఫిక్స్ చేయాలి. అయితే ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో టికెట్లు ఆశించిన అభ్యర్థులు తమ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్లలో కార్పొరేటర్లు చాలామంది అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లరుతున్నారు.
ఎలాగో బిఆర్‌ఎస్ సీట్లు ఫిక్స్ అయ్యాయి..కాకపోతే జిహెచ్‌ఎంసి పరిధిలో గోషామహల్, నాంపల్లి సీట్లు ఫిక్స్ చేయాలి. అటు కాంగ్రెస్, బిజేపిల అభ్యర్ధులు ప్రకటించాలి. దీంతో కొన్ని సీట్లలో కార్పొరేటర్లు పోటీకి వస్తున్నారు. కానీ ఏ పార్టీ కూడా వారిని అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆసక్తి చూపటం లేదని రాజకీయ వర్గాలు అంటున్నారు. ఒకటి రెండు సార్లు కార్పొరేటర్లుగా గెలిచిన అభ్యర్థులు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడుతుంటే పార్టీ నేతలు మాత్రం మాట్లాడటం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కార్పొరేటర్లు అందరూ పార్టీ అగ్ర నాయకులను కలిసి మొరపెట్టుకున్న ఫలితం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు.
కార్పొరేటర్ల పై అవినీతి ఆరోపణలు ఉన్నాయనే కారణంతో టికెట్ ఇవ్వడం లేదని చెప్పి అగ్ర పార్టీ నేతలు తప్పించుకోవాలని చూస్తున్నారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్ల పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాల పైనే ఉంది. అలాంటి వారికి టికెట్ ఇస్తే గెలుస్తారో లేదో తెలియదు లేకపోతే ఒక డివిజన్ ని కోల్పోవాల్సి వస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. కార్పొరేటర్లు తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారి అయినా పోటీ చేస్తామని పార్టీ అగ్రనేతలకు సంకేతాలు పంపడం తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బిజేపిలో ఈ తలనొప్పి ఎక్కువ ఉంది. ఎందుకంటే బిజేపికి 40 పైనే కార్పొరేటర్లు ఉన్నారు.
అటు బిఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో కార్పొరేటర్లు పేర్లు లేవు. మిగిలిన పార్టీలు కూడా ఇస్తాయని నమ్మకం లేదు. పార్టీల పెద్దలకు పార్టీలో ఆశావహులతో పాటు కార్పొరేటర్లు కూడా సమస్యగా మారారని తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా కార్పొరేటర్లు సీటు ఆశించేది బిజేపిలోనే..ఒకవేళ వారికి సీటు రాకపోతే బిజేపి గెలుపుకు గండి పడే ఛాన్స్ కూడా ఉంది.