బీసీ కుల గణనతో సమూల మార్పులు వస్తాయని, కుల గణన వల్ల అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గుణన చేపట్టాలన్నారు గిడుగు రుద్రరాజు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల గణనను చేపట్టాలని, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు, ఎన్జీఓలు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులూ అందుబాటులో ఉంటారన్నారు. వెంటనే ఏపీలో కుల ఆధారిత జనగణన ప్రారంభించి చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని, కదిరిలో 21న కులగణనపై సమావేశం నిర్వహించనున్నట్లు గిడుగు రుద్రరాజు తెలిపారు.
కుల గణన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేస్తామని, నవంబర్ 7న నంద్యాల, 9న విజయనగరం , 10వ శ్రీకాకుళం, 11వ తేదీన విశాఖల్లో కులగణనపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గిడుగు రుద్రరాజు. ఈ నెల 30వ తేదీన ఏపీ పీసీసీ కొత్త కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఇద్దరు నేతల మధ్య రాజకీయం నడుస్తుందని, వారి పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు గిడుగు రుద్రరాజు. బీజేపీ ప్రత్యేక హాదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించగా, 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ ఢిల్లీకి వంగి వంగి దండాలు పెడుతున్నారని గిడుగు రుద్రరాజు మండిపడ్డారు.