ఏపీలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అయితే, అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
అయితే ఈ సంఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తవలస మండలంలో రైలు ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి సంఘటన స్థలి వద్దకు వీలైనన్ని అంబులెన్స్ లు పంపించాలని స్పష్టం చేశారు. ఘటన స్థలికి సమీపంలోని ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.