తెలంగాణ దంగల్‌లో బీజేపీ-జనసేన అభ్యర్థుల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు 8 స్థానాల్లో మిత్రపక్షంతో కలిసి బరిలో దిగినా.. ప్రచారానికి మాత్రం ప్రధాన నాయకుడు పత్తాలేకుండా పోయారు. జనసేనాని తెలంగాణ ఎన్నికల్లో వారాహి ప్రచార యాత్ర చేస్తారా.? లేదా.? అనే దానిపై క్లారిటీ వచ్చినట్టే ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. రేపు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొననున్నారు.