వైసీపీలోకి ముద్రగడ..?

-

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళబోతున్నారు.ఏపిలో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌.ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్ధులను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్న సీఎం జగన్‌ త్వరలోనే పద్మనాభం అభ్యర్ధిత్వాన్ని కూడా ఖరారు చేస్తారని వైసీపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.ఏడాది క్రితమే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళతారనే రూమర్‌లు వచ్చాయి.తాజాగా ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన జరిపిన చర్చలు ఈ రూమర్‌లకు బలం చేకూరుస్తున్నాయి. ముద్రగడ మళ్ళీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.కాకినాడ పార్లమెంట్‌ నుంచి కానీ, పెద్దాపురం ఎమ్మెల్యేగా కానీ ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

mudragada padmanabham

ఎప్పుడో రాజకీయాలకు దూరమైన పద్మనాభం గత కొన్ని రోజులుగా ఏపీలోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సఖ్యతగా ఉన్నారు. క్రితం ఏడాది పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన వారాహి యాత్రకు ఆయన కౌంటర్‌లు ఇచ్చారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని పవన్‌ విమర్శించగా దీనికి ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ బహిరంగ లేఖలు విడుదల చేయడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది.ఆ తరువాత మరో అడుగు ముందుకేసిన పద్మనాభం పిఠాపురంలో తనపై పోటీ చేసి గెలవాలని పవన్‌కళ్యాణ్‌కి సవాల్‌ విసిరారు.

ఈ సవాల్‌తో ముద్రగడ యాక్టివ్‌ పాలిటిక్స్‌పై,వైసీపీలో చేరికపై అప్పట్లో జోరుగా చర్చలు జరిగాయి. ఆ తరువాత కాస్త సైలెంట్‌ అయిన పద్మనాభంని రెండురోజుల క్రితం బెంగుళూరులో ఎంపీ మిథున్‌రెడ్డి పిలిపించుకుని చర్చలు జరిపారు. ముద్రగడకు టిక్కెట్‌ కేటాయించే విషయంపై మిథున్‌రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయడానికి తగిన ఆర్ధిక స్తోమత లేదని చెప్పిన పద్మనాభం అసెంబ్లీకి పోటీ చేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆయనకు పెద్దాపురం టిక్కెట్‌ ఆఫర్‌ చేశారు మిథున్‌రెడ్డి. తన కుమారుడి కోసం ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలని ముద్రగడ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కుమారుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది.దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

తండ్రి వీరరాఘవరావు మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు ముద్రగడ పద్మనాభం. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం జనతా పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ పద్మనాభం మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. ఈ ఓటమి తరువాత తాను పోటీ చేయనని ప్రకటించారు. అయితే 2009లో వై. ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ కాపు ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయగా ఓటమి చెందారు. ఓటమి పొంది ప్రశాంతంగా ఉన్న పద్మనాభంను కొంతమంది కాపు సోదరులు, ‘కాపు ఉద్యమం’ను ముందుకు తీసుకుని వెళ్ళమని కోరిన మీదట, ఆయన ఉద్యమానికి సారథ్యం తీసుకున్నారు. దీంతో ముద్రగడకు కాపు నాయకుడిగా గుర్తింపు లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news