టీఆర్ఎస్‌లో నాడు హీరో… నేడు జీరో… పెద్ద తంటా వ‌చ్చిందే..!

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య చాలా జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొన్నిచోట్ల మంత్రులకు ఎమ్మెల్యేలకు పొస‌గ‌ని పరిస్థితి ఉంటే… మరికొన్ని చోట్ల ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎంత మాత్రం పడటం లేదు. మరికొన్ని చోట్ల పాత.. కొత్త నాయకుల మధ్య విభేదాలు తీవ్రతరమ‌వుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి వ‌ర్సెస్‌ మాజీ మంత్రి మధ్య నడుస్తున్న ఆధిప‌త్య పోరు రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉండి జిల్లా రాజకీయాలను శాసించిన పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది.

ఆ టైంలో జిల్లాలో ఇతర నేతలు పోటీ లేకపోవడంతో మహేంద‌ర్‌రెడ్డి ఎదురు లేదు. అయితే ఇప్పుడు పూర్తిగా రివ‌ర్స్‌ అయింది. జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు తయారయ్యారు. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డితో పాటు తన సమీప బంధువు అయిన స‌బితా ఇంద్రారెడ్డి కూడా మంత్రులుగా ఉండి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. దీనికితోడు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డి తాండూరులో ఓడిపోయారు. ఆయనపై గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అనుంగు శిష్యుడిగా మారిపోయారు.

ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి సైతం రోహిత్ రెడ్డిని సపోర్ట్ చేస్తుండడంతో చివరకు తన నియోజకవర్గంలో కూడా మహేందర్‌రెడ్డి మాట చెల్లుబాటు కాని పరిస్థితి. కనీసం ఎమ్మెల్సీ అయినా వస్తుందని ఆశపడ్డ మహేందర్‌రెడ్డి ఆశలపై కేసీఆర్ నీళ్లు చ‌ల్ల‌డంతో ఇప్పుడు ఆయన మరింతగా రగిలిపోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో తనకు తిరుగులేదని భావించిన ఆయన ఇప్పుడు తనకు స్వయానా అత్త అయ్యే సబితా ఇంద్రారెడ్డి ఆధిపత్యాన్ని ఎంతమాత్రం సహించడం లేదు. సబిత ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నాయి.

ఇక మహేందర్రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసిన జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు ఆయనను ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో స‌బిత వ‌చ్చే కార్య‌క్ర‌మాల‌కు మహేందర్ రెడ్డి ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి రావ‌డం లేదు స‌రిక‌దా.. ఆమె మంత్రి అయ్యాక మ‌హేంద‌ర్‌రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా ఆమెను క‌ల‌వ‌లేదు. ఏదేమైనా పార్టీలో గ‌త ఐదేళ్లు హీరోగా ఉన్న వ్య‌క్తి నేడు ఇలా జీరో స్థాయికి ప‌డిపోయాన్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వ‌స్తున్నాయి. వీరి మ‌ధ్య స‌యోధ్య కోసం పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news