ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరుగనివ్వనని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ఛలో నల్గొండ బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. కృష్ణా జలాల కోసం చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండ వచ్చానని తెలిపారు. 24 ఏళ్లు పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రజల్లో ఫ్లోరైడ్ సమస్య పోయింది.
నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేల్లు పరిపాలించాను. నాపాలనలో ఎవ్వరికీ తక్కువ చేయలేదు. కొందరూ ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడి వరకు అయినా పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని అప్పట్లో నేనే పాట రాశాను. బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తి అయింది. డిండి ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు అన్నారు.