నిషేధం తర్వాత ఆసిస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ దుమ్ము రేపుతున్నాడు. వరుస సెంచరీలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. రెండు నెలల క్రితం జరిగిన యాషెస్ సీరీస్ లో రికార్డులు సృష్టించిన స్మిత్… తాజాగా పాకిస్తాన్ తో జరుగుతున్న సీరీస్ లో కూడా దుమ్ము రేపుతున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ ని స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 7 వేల పరుగులు చేసి… సరికొత్త రికార్డ్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు.
73 ఏళ్ల క్రితం 1946లో ఇంగ్లండ్ గ్రేట్ వాలీ హమ్మాండ్ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగులు సాధించాడు. కాని స్మిత్ అంతకంటే తక్కువ ఇన్నింగ్సులలో ఈ రికార్డ్ నమోదు చేసాడు. స్మిత్ 126వ ఇన్నింగ్స్‌లోనే ఆ మార్కుని అందుకున్నాడు. మహ్మద్ ముసా బౌలింగ్‌లో సింగిల్ తీసి చరిత్ర సృష్టించాడు. టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అతని తర్వాతి స్థానంలో ఉన్నాడు. 134 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల పరుగుల మార్క్ ని వీరు అందుకున్నాడు. సచిన్ నాలుగో స్థానంలో… అంటే 136 ఇన్నింగ్సులలో ఈ రికార్డ్ సాధించాడు.
విరాట్ కోహ్లి, కుమార సంగక్కారా, గ్యారీ సోబర్స్ 138 ఇన్నింగ్ లలో 7 వేల పరుగులు చేసాడు. ఆసీస్ తరఫున ఏడు వేల టెస్టు పరుగులు సాధించిన 11వ ఆటగాడు స్మిత్. ఆసిస్ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ తన టెస్టు కెరీర్‌లో 6,996 పరుగులు చేయగా ఆ రికార్డ్ ని కూడా స్మిత్ అధిగమించాడు. గత ఏడాది జరిగిన సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ లో స్మిత్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఏడాది పాటు అతను నిషేధానికి గురి కావడంతో పాటు గా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.