తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే షురూ కానుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దాదాపు మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సంస్థలో కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా పోస్టుల భర్తీ లేదు. మరోవైపు ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తోంది.
ఈ క్రమంలో మూడు వేల పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో సంస్థపై వేతనాల రూపంలో ప్రతి నెల రూ.8.40 కోట్లు, ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని వెల్లడించారు. ఆర్టీసీ ప్రతిపాదనల్లో మూడింట రెండొంతులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.