కుహనా మేధావుల ‘హక్కులు’

-

వీరందరికీ లోకకంటకులు హతమైనప్పుడే మానవహక్కులు గుర్తొస్తాయి. దిశ ప్రాణం గిలగిలా కొట్టుకున్నప్పుడు తమ కూతురో, మనవరాలో మదిలో ఉండదు. ‘ఎలైట్‌ పీపుల్‌’గా గుర్తింపబడాలనే ఒక ఐడెంటిటీ క్రైసిస్‌తో గింజుకుంటుంటారు.

దిశ పాశవిక హత్యోదంతం ఎక్కడ మొదలైందో, అక్కడే ముగిసిపోయింది. యావద్దేశం నిన్న మరో దీపావళిని జరుపుకుంది. సరైన ‘దిశ’గా సత్వర న్యాయం జరిపినందుకు పోలీసులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభినందించారు. కానీ, కొంతమంది సూడో మేధావులకు, రాజకీయ నాయకులకు, సంస్థలకు ఈ ‘ఎన్‌కౌంటర్‌’ రుచించలేదు.

ఈ అంధ మేధావులకు బాధితులెప్పడూ కనిపించరు. నిందితులు మాత్రమే వారి దృష్టిలో మానవులు. గాయపడిన జంతువు పట్ల కరుణ చూపే ఓ రాజకీయ ప్రముఖురాలు, పెద్దింటి కోడలికి, అర్ధరాత్రి బస్సులో ఓ అమాయకపు యువతి ఆక్రందన వినిపించదు. కటిక చీకటిలో నాలుగు మానవమృగాలు జరిపిన అమానుషకాండ కనిపించదు. బహుశా వారికి ఆడపిల్లలు లేకపోవడమో లేక అసలు పిల్లలు లేకపోవడమో ఉండాలి లేదా కనీసం తాము చేపట్టిన ఈ మానవహక్కుల పరిరక్షణ ఎంతమంది తల్లుల కన్నీళ్లు తుడిచిందో చెప్పగలిగిఉండాలి.

మెజారిటీ ప్రజలు ఓట్లేసి గెలిపించిందే ప్రభుత్వం. కోటానుకోట్ల ప్రజలు కోరింది చట్టమో, న్యాయమో ఎందుకు కాకూడదు? ఒకప్పుడు తక్షణ న్యాయం పేరుతో పల్లెటూర్లలో నక్సలైట్లు విధించిన శిక్షలకు చాలా ఆదరణ దక్కింది. ఇప్పుడైనా అంతే. ప్రజానీకం ఎప్పుడూ సత్వర న్యాయమే కోరుకుంటుంది.  అది ఎవరు అమలు చేస్తే వారే వారికి ఆరాధ్య దైవాలు. విచిత్రంగా ఈ మేధోవర్గానికి నక్సలైట్లు అమలుచేసిన న్యాయం నచ్చింది. పోలీసులు చేసింది మాత్రం నచ్చదు. ఏం జరిగినా, చట్టప్రకారమే జరగాలని సన్నాయినొక్కులు నొక్కే ఈ సోకాల్డ్‌ ఎలైట్‌ పీపుల్‌, ముత్తాతల కాలం నాటి బూజు పట్టిన ఆ చట్టాలనే ఇంకా అమలు చేయాలని ఎలా అడుగుతారు? ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారమే వాటిని మార్చాల్నిన అవసరమేర్పడిందని నిన్నటి ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా వారికి అర్థం కాకపోవడం ఈ దేశం చేసకున్న దురదృష్టం.

ఇక నిజంగా జరిగిందేంటంటే, ‘‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం అర్ధరాత్రి దాటాక, నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లి, బాధితురాలి ఫోన్‌, పవర్‌బ్యాంక్‌ ఎక్కడ దాచారో పోలీసలు చూపించమన్నారు. ఇక్కడని, కాదు అక్కడని తిప్పి, పోలీసుల ఆయుధాలనే లాక్కొని వారిపైనే దాడికి పాల్పడ్డారు. లొంగిపోమ్మని పలుమార్లు హెచ్చిరించినా వినకుండా రాళ్లు, కర్రలు పిస్టల్‌లతో దాడికి దిగడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిపోయాక, వెళ్లి చూస్తే నలుగురు నిందితులు మృతిచెందిఉన్నారు.’’  ఈ నిజాన్ని నిర్ధారించడానికి ఎన్ని బృందాలు వస్తాయో రానివ్వండి. ఎంతమంది మేధావులు తమ కలాలకు, గళాలకు పనిచెప్తారో చెప్పనివ్వండి. జరిగింది మాత్రం అంతే.. ‘చట్టం తన పని తాను చేసుకుపోయింది’.

నిర్భయ ఉదంతం జరిగి ఏడేళ్లయినా, ఇంకా దోషులకు శిక్షలు విధించబడలేదు. వారిని జైల్లో మటన్‌, చికెన్‌లతో మేపుతూనే ఉన్నారు. దేశంపైనే దాడికి దిగి ఎందరో ఆమాయకుల, పోలీసుల ప్రాణాలు బలిగొన్న కసబ్‌ను ఉరితీయడానికి ఎంత సమయం పట్టింది? ఇదీ మన చట్టం, న్యాయం పరిస్థితి. మెజారిటీ ప్రజలు న్యాయంగా భావించిందే న్యాయంగా మారాలి. అది మేధావికైనా, సామాన్యుడికైనా, ఉన్నోడికైనా, లేనోడికైనా ఒకేరకంగా ఉండాలి. దాన్ని చట్టంగా మార్చేందుకు సమాజమంతా పోరుబాట పట్టాలి. అప్పుడే సత్వరన్యాయం సాధ్యం.

 

రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news