టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన సాహో సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాకపోగా చాలావరకు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ రేంజ్ మరియు మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగింది. కావున ఆయన నుండి ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ అందరూ కూడా భారీ సినిమాలనే ఆశిస్తారు కాబట్టి, దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో సాహోకు ఖర్చు చేయడం జరిగిందని అప్పట్లో నిర్మాతలు చెప్పారు. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా ఎంతో భారీగా,
అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కినప్పటికీ, ఆకట్టుకునే కథ మరియు కథనాలు లేవని మెజారిటీ ప్రేక్షకులు సినిమాపై విమర్శలు చేసారు. దానితో ఆ సినిమా తరువాత ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న జాన్ విషయమై ఖర్చును కొంత తగ్గించాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తన్న ఈ సినిమాకు రూ.150 నుండి రూ.180 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిశ్చయించారట.
ఒకరకంగా ఈ విధంగా కాస్ట్ కొంత కంట్రోల్ చేయడం వలన, ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా నష్టాలు కొంతవరకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని హీరో ప్రభాస్ కూడా యూనిట్ కు చెప్పారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి రొమాంటిక్ ప్రేమకథగా, యాక్షన్ ప్రధానంగా సాగుతున్న ఈ సినిమా కోసం ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో రూ.50 కోట్లతో భారీ సెట్టింగ్ ని కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు సమాచారం…..!!