పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా.. నాయకులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని చెప్పారు. కానీ, బీఆర్ఎస్లో కొనసాగే ఏ నాయకుడికి స్వేచ్ఛ, ఆత్మగౌరవం రెండూ ఉండవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ లోపించింది కాబట్టే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
‘అంతేకాదు.. బీజేపీతో కలుస్తున్నామని కేటీఆర్ తనతో అన్నారు.. అది నాకు నచ్చలేదని చెప్పాను. బీజేపీతో కలవడం ఏంటని కూడా ప్రశ్నించాను. కానీ, ఆట్రేడీ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నేను పార్టీ వీడటానికి అదొక కారణం’ అని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అనుకున్నానని అన్నారు. అసలు పార్టీల ఫిరాయింలపుకు ముందు తెరలేపింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. కేసీఆర్ గొప్ప నాయకుడు, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పారు. రాజకీయంగా అవకాశాలు కల్పించిన కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.