అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సంక్రాంతి కోసం చూస్తున్నారు అభిమానులు. జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. అయితే ‘అల వైకుంఠపురములో’ టీజర్ నేడు విడుదల అవుతుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. నేటి టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ భాయ్ అకస్మాత్తుగా మరణించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
నూర్ భాయ్, తమ ఇంటి సభ్యుడని, ఆయన మరణం కలచి వేసిందని పేర్కొన్న గీతా ఆర్ట్స్, అతి త్వరలోనే టీజర్ విడుదలకు సంబంధించిన అప్ డేట్ ను ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల నుంచి వరుణ్ తేజ్ వరకూ మెగా హీరోలందరితో నూర్ భాయ్ కి మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, రామ్ చరణ్ సహా పలువురు మెగా హీరోలు ఆయన్ను పరామర్శించి వచ్చారు.